డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని అన్ని కళాశాలలో గల విభాగాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం సందర్శించారు.
ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైన సందర్బంలో అన్ని కళాశాలలను ఆయన పర్యవేక్షించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ కళాశాల, న్యాయ శాస్త్ర కళాశాలకు ప్రధానాచార్యులు డా. నాగరాజ్‌తో కలిసి వెళ్లి ఆయా విభాగాలలోని అధ్యాపకులతో మాట్లాడారు.
కాల నిర్ణయ పట్టిక ఆధారంగా తరగతులు తీసుకోవాలని సూచించారు. నూతన పాఠ్యప్రణాళికలో పరిశోధానాత్మకమైన మార్పులకు సూచనలు చేశారు. నూతన పాఠ్యప్రణాళికల నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు.
కరోనా కాలంలో కోవిద్ – 19 నిబంధనల మేరకు నూతన విద్యా సంవత్సరం ఆలస్యమైన సందర్భంగా విద్యార్థులు నష్టపోకుండా త్వరితగతిన సిలబస్ పూర్తి చేసి మంచి ఫలితాంశాలను వెలువరించాలని ఆయన సూచించారు.
మధ్యాహ్నం దక్షిణ ప్రాంగణంలోని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల, ఫిజిక్స్ కళాశాల, జియో ఇంఫర్మాటిక్స్ కళాశాల, హ్యుమానిటీస్ కళాశాలను సందర్శించారు. హాస్టల్స్ కూడా పర్యవేక్షించారు.