డిచ్పల్లి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ర్యాంక్ పొంది సుప్రసిద్ధ శాస్త్ర వేత్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మరో మూడు అంతర్జాతీయ పత్రికల్లో మెమరీ డివైసెస్, స్పిన్ డ్రాన్ డివైసెస్, డ్రగ్ డెలవరి అండ్ నానో టెక్నాలజీ మీద విస్తృతమైన ప్రయోగాలు చేసిన పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయని ఒక ప్రకటనలో తెలిపారు.
అమెరికా, ఇంగ్లాండ్ సంయుక్త ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘‘మెటీరియల్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్’’ అనే జర్నల్‌లో, నెదర్లాండ్స్ నుంచి వెలువడుతున్న ‘‘సాలిడ్ స్టేట్ కమ్యూనికఏషన్స్’’ అనే జర్నల్‌లో, ‘‘జర్నల్ ఆఫ్ ఇండియా కెమికల్ సొసైటీ’’ వారి నుంచి వెలువడుతున్న అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ ప్రచురణలు అంతర్జాతీయ పత్రీకల్లో ప్రచురించబడి ప్రపంచ స్థాయిలో గల నానో టెక్నాలజీలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలతో ప్రాచుర్యాన్ని, ప్రశంసలను అందుకున్నాయన్నారు. ఈ సంవత్సర ప్రారంభ దశలోనే మూడు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురణలు వెలువడడం విశేషమని అన్నారు. ప్రపంచ ర్యాంకును అధిగంచడం కోసం ఇటువంటి వేగవంతమైన పరిశోధనా కృషి అవసరమని పేర్కొన్నారు.