నసురుల్లాబాద్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నసురుల్లాబాదు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లడుతూ శాంతి యుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, సోయి లేకుండా మాట్లాడుతున్నాడని, ఇటువంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యాడో దేశం ప్రశ్నిస్తోందన్నారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి ఏర్పడిరదని, రాజ్యాంగం వల్ల సిఎంకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని చూసి ప్రశంసిస్తోందని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన ఘనత అంబేద్కర్ రాజ్యాంగానిదేనన్నారు. బడ్జెట్‌పై అభ్యంతరాలు చెబితే ఇబ్బందేమీ లేదు, కానీ బూతులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. దళితులంటే నీకెందుకు చులకన? అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావు? దేశంలోని ప్రతి సీఎం అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకావడం సంప్రదాయం. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించడం లేదు? దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పడానికి కారణం… కేసీఆర్‌కు దళితులపై ఉన్న ద్వేషం, కసి కారణమా? దళిత డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విరుచుకుపడ్డారు.
కార్యక్రమంలో ఓబీసీ జిల్లా నాయకుడు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి శంకర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేకల రామన్న, గంగాధర్ గుప్తా, మైనారిటీ మండల అధ్యక్షులు సమీర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు జెల్ల సాయిలు, శేఖర్, లక్ష్మను, రామ్, పవన్, సాయికుమార్, గంగాధర్ పాల్గొన్నారు.