కామారెడ్డి, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దగల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కెసిఆర్‌కు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు 250 మంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల కావడం లేదన్న బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని, తమ ఆత్మహత్యలకు కారణం కెసిఆర్ పాలనే అని రాయడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బంగారు తెలంగాణ పేరుతో నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రిని మారిస్తేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రాజు, సతీష్, సందీప్, ఆంజనేయులు, నర్సింలు, ప్రవీణ్, నవీన్, ప్రదీప్, రవి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.