కామారెడ్డి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
మత్తుపదార్థాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కావద్దని పేర్కొన్నారు. విద్యార్థులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధిక మంది విద్యార్థులు ఉన్నారని , విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయుడు సాయిలు చేసిన కృషిని అభినందించారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, ఉపాధ్యాయులు సహేందర్ నాథ్, చంద్ర మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.