డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ డ్రగ్స్ నిషేదానికి విద్యార్థులందరు సమాయత్తం కావాలని కోరారు. డిచ్ పల్లిలోని ఎస్. ఎల్. జి. గార్డెన్ లో డిచ్‌పల్లి, దర్పల్లి సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు.
ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ‘‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’’ గా చేయడానికి ప్రతిపాదనలు చేసిందన్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి సమాయత్తం అయ్యారు. మత్తు పదార్థాల నియంత్రణ మీద యుద్ధం ప్రకటించాలని పిలుపునిచారన్నారు.
ఈ కర్తవ్యంలో ముఖ్యంగా పోలీస్, ఎక్సైజ్ శాఖలను, ప్రజా ప్రతినిథులను భాగస్వామ్యం చేస్తూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాల ప్రభావం ఎక్కువగా యువతపై పడి బానిసలుగా తయారవుతున్నారని అన్నారు. ఎక్కువగా యువత కళాశాల స్థాయిలోనే ఉంటారని, ఈ అవగాహన సదస్సుకు పాల్గొన్న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తదాయకం అవుతుందని అన్నారు.
అంతేగాక మన రాష్ట్రాన్ని పూర్తి ‘‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’’ గా మార్చే క్రమంలో విద్యార్థుల బాధ్యత ఎక్కువగా ఉండాలని కోరారు. విద్యార్థులు తమ కాలేజీలో, హాస్టల్లో, తమ తమ ఊళ్ళల్లో ఎవరైనా మత్తు పదార్థాల తయారు లేక గంజాయి సాగు, సరఫరా, సేవనం వంటి దృశ్యాలు కనిపించినా వెంటనే పోలీస్, ఎక్సైజ్ శాఖలకు గాని సర్పంచ్, ఎంపిటీసీలకు గాని వెంటనే సమాచారం అందించాలని అన్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా మాదక ద్రవ్యాల నియంత్రణకు సకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధి బాజిరెడ్డి జగన్, డిసిపి, ఎసిపి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.