గాంధారి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్యకర్తలే తనకు ప్రధాన బలం అని వారిని కాపాడే బాధ్యత తనపై ఉందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మదన్ మోహన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, తెరాసలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
లింగంపల్లిలో తెలంగాణ ప్రభుత్వం జ్యూట్ మిల్లు పేరుతో పేదల భూమి లాక్కుంటుంటే, అట్టి భూములను కోర్టుకు వెళ్లి కాపాడానని అన్నారు. జూట్ పరిశ్రమ యజమానులతో కుమ్మకై స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బి ఫారంతో గెలిచి కేవలం డబ్బుల కొరకు పార్టీ మారిన వ్వక్తి సురేందర్ అని అన్నారు. కేవలం తన స్వార్థం కొరకు ఎల్లారెడ్డి ప్రజలను కెసిఆర్ వద్ద తాకట్టు పెట్టిన ఎమ్మెల్యే సురేందర్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైన ఉందన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన చందాలు చేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అమ్ముడు పోయిన దుర్మార్గుడు సురేందర్ అని అన్నారు. కరోనా కష్ట కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో పడుకున్న వ్యక్తి సురేందర్, అలాంటి వానికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరోనా కాలంలో బాధితులు ఎంవైఎఫ్ ఆధ్వర్యంలో సహాయాసహకారాలు అందించామని మదన్ మోహన్ అన్నారు.
అత్యవసర సమయంలో బాధితులకు అంబులెన్సు ఏర్పాటు చేశామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తల కష్టాలను తెలుసుకొని తన వంతు సహాయం చేస్తున్నామని అన్నారు. తాను డబ్బులు కోసం రాజకీయాలలోకి రాలేదని స్పష్టం చేశారు. తాను అమెరికాలో సంపాదించిన డబ్బులతో తన కార్యకర్తలను కాపాడుకుంటున్నానని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలోనే అధికార పార్టీకి సరి సమానంగా పోటీ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మదన్ మోహన్ ఒక్కడే అని అన్నారు.
అప్పుడు తనపై గెలిచిన ఎంపీ బి బి పాటిల్ పత్తా లేకుండా పోయారని అన్నారు. ఎంపీగా బీబీ పాటిల్ చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. బీబీ పాటిల్ కనపడుటలేదు అని స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తాను ఇక్కడి వాడినని అందరితో కలిసి ఉండే వాడినని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వాడినని, వారిని కాపాడే బాధ్యత తనపై ఉందని హామీ ఇచ్చారు.
అందరూ పనికట్టుకొని కార్యకర్తల మధ్య గ్రూప్‌లు చేస్తున్నారని, వాటిని కార్యకర్తలు పట్టించుకోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ అన్నారు. అంతకుముందు గాంధారి మండల కేంద్రంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వివిద కారణాలతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు మదన్ మోహన్ ఆర్థిక సహాయం అందించారు.
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి 2 లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజులు, సర్దార్ సింగ్, రమేష్ రావు, నీల రవి, చాకలి శ్రీనివాస్ వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.