భీమ్‌గల్, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొక్కలను సంరక్షించేందుకు గాను రోడ్లకు ఇరువైపులా సరిహద్దులను గుర్తిస్తూ ట్రెంచ్ కటింగ్ చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మంగళవారం ఆయన వేల్పూర్ ఎక్స్ రోడ్డు నుండి భీంగల్ పట్టణం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను పరిశీలించారు. పలుచోట్ల రోడ్డు సరిహద్దులు కబ్జాకు గురైన విషయాన్ని కలెక్టర్ గమనించారు. దీనివల్ల హరితహారం మొక్కల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతున్నట్టు గుర్తించిన కలెక్టర్, రోడ్డు సరిహద్దులకు మార్కింగ్ వేసుకుని ట్రెంచ్ కటింగ్ జరిపించాలని అధికారులకు సూచించారు.
శనివారం నాటి నుండే ఈ పనుల ప్రారంభం అయ్యేలా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులకు బాధ్యతలు పురమాయించారు. పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా ప్రదేశాలు ఎత్తుపల్లాలతో కూడుకుని అస్తవ్యస్తంగా ఉండడంతో, వాటిని చదును చేసి, ట్రెంచ్ కటింగ్ జరిపించిన తరువాతనే మొక్కలు నాటాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటుతున్న మొక్కలు సంరక్షించబడాలంటే కనీసం 5 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలనే నాటాలని, అవసరమైతే అటవీ శాఖ ద్వారా తాము మొక్కలు సమకూరుస్తామని అన్నారు.
కాగా, ఇప్పటికే నాటిన మొక్కల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. మొక్కల చుట్టూ పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కాగా, భీంగల్ పట్టణంలో నిర్వహిస్తున్న నర్సరీని కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. నర్సరీ నిర్వహణ సక్రమంగా లేకపోవడం పట్ల కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నర్సరీలో 87 వేల మొక్కలు పెంచాల్సి ఉండగా కనీసం 30 వేల మొక్కలు కూడా లేవన్నారు. వాటిలోనూ చాలా వరకు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయని, నిర్వహణను మెరుగు పరుచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాను వారం రోజుల్లో మళ్ళీ పరిశీలనకు వస్తానని, పరిస్థితిలో మార్పు కనిపించాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్ డీ ఓ శ్రీనివాస్, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.