నిజామాబాద్, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి పూర్తి వివరాలు పొందుపర్చాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తహసీల్దార్లకు సూచించారు. ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం విషయమై కలెక్టర్ మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయా మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ లోని సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆయా మండలాల వారీగా పెండిరగ్ దరఖాస్తుల గురించి ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. నిశిత పరిశీలన జరిపి సమగ్ర వివరాలు పొందుపర్చేందుకు కొంత అదనపు సమయం పట్టినప్పటికీ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగల్గుతామని అన్నారు.
సమగ్ర వివరాలు పేర్కొన్న పక్షంలో, అవి నిబంధనలకు లోబడి ఉన్నట్లయితే పెండిరగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు అనువుగా ఉంటుందన్నారు. సరైన వివరాలను ఆధారాలతో పంపిస్తే ధరణి దరఖాస్తులకు వెంటనే ఆమోదం తెలుపుతున్నామని అన్నారు. ఎలాంటి వివాదాలు, ఇతరుల నుండి అభ్యంతరాలు లేని దరఖాస్తులను వెంటదివెంట పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.