కామారెడ్డి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను సక్రమంగా యాప్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలని సూచించారు. ప్రతి నెల వైద్య సిబ్బంది అంగన్‌వాడి కేంద్రాలను పరిశీలించాలని కోరారు. బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు.
అర్హత గల వారు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలని సూచించారు. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్ పిడి సరస్వతి, సిడిపివోలు, వైద్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.