డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హిందీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి లావూరి విజయలక్ష్మికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేశారు. అందుకు సంబంధించిన వైవా-వోస్ (మౌఖిక పరీక్ష) ను గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. హిందీ విభాగంలోని అసోషియేట్ ప్రొఫెసర్ డా. పి. ప్రవీణాబాయి పర్యవేక్షణలో పరిశోధకురాలు ‘‘బంజారా సమాజ్ ఉద్భవ్, పరివేశ్’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రుపొందించి సమర్పించారు.
వైవా వోస్‌కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా ఇఫ్లూ విశ్వవిద్యాలయానికి చెందిన హిందీ విభాగ అధ్యాపకులు ఆచార్య శ్యాం రావు రాథోడ్ విచ్చేసి పరిశోధకురాలిని సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. వైవా వోస్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ బంజారా సంస్కృతి సమాజం సాహిత్య అభివృద్ధిని రికార్డ్ చేస్తూ పరిశోధన చేసిన లావూరి విజయలక్ష్మిని అభినందించారు.
మారుతున్న కాలానుగుణంగా బంజారా పరిణామ వికాసాన్ని పరిశోధన చేస్తూ తదనంతరం పరిశోధనను ముందుకు తీసుకొని వెళ్లాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ శుభాభినందనలు తెలిపారు. వైవా వోస్‌కు చైర్మన్‌గా కళల పీఠాధిపతి ఆచార్య కనకయ్య, కన్వీనర్‌గా బిఓఎస్ డా. జమీల్ అహ్మద్ వ్యవహరించారు. విభాగాధిపతి డా. పార్వతి, ప్రిన్సిపల్ డా. ఆరతి, డా. నాగరాజు, డా. గుల్ – ఇ – రాణా, డా. అబ్దుల్ ఖవి, డా. అబ్దుల్ ఖురేషి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.