ఉద్యమ స్పూర్తితో మన ఊరు – మన బడి కార్యక్రమం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం వారు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆకాంక్ష అయిన కేజీ టు పీజీకి అనుగుణంగా అడుగులు ముందుకు పడుతున్నాయని, మనందరికీ ఎంతో సంతృప్తిని అందించే ఈ మహత్తర కార్యంలో అందరూ భాగస్వాములై అంకిత భావంతో పని చేయాలని కోరారు. తొలి విడతగా మూడో వంతు పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, దీని ద్వారా 60 శాతం మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని మంత్రులు పేర్కొన్నారు.

ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపిక చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపర్చే పనులు జరిపించాలని సూచించారు. ఈ కార్యక్రమం అమలైన బడులలో అన్ని వసతులతో చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా కార్పొరేట్‌ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లాబరేటరీ, లైబ్రరీ, ప్రహరీ గోడ, కిచెన్‌ షెడ్స్‌, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్‌, ఫర్నీచర్‌, డిజిటల్‌ విద్యా బోధనకు సంబంధించినవి తదితర పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

తొలి దశలో 3497 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ, 371 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరిపించాలని నిర్ణయించామని తెలిపారు. అయితే పనుల అంచనాలను పక్కాగా నిర్ధారిస్తూ రూపొందించేలా చూడాలని, లేని పక్షంలో నిధులు వృధా అయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్లకు సూచించారు. ఏ పాఠశాలలో ఏయే సౌకర్యాలు అందుబాటులోకి తేవాల్సి ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ బడులను సందర్శించాలని కలెక్టర్లను కోరారు.

అత్యధికంగా 790 మంది మొదలుకుని వందకు పైగా విద్యార్థులున్న పాఠాశాలలను తొలి విడత జాబితాలో ఎంపిక చేయాలని సూచించారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని, ఎస్‌ఎంసి చైర్మన్‌తో పాటు స్థానిక సర్పంచ్‌, ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్‌ విభాగం ఏ.ఈ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పి చైర్మన్లతో పాటు జెడ్‌పీటిసిలు, గ్రంథాలయాల చైర్మన్లు తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని సూచించారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్‌ఆర్‌ఐలు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలని, వారి ఆర్ధిక సహకారంతో బడులను మరింతగా అభివృద్ధి చేసుకోగల్గుతామని అన్నారు. ఎవరైనా పాఠశాలకు రూ. పది లక్షలు విరాళం ఇచ్చినట్లయితే తరగతి గదికి వారి పేరు పెట్టవచ్చని, 25 లక్షలు విరాళం అందిస్తే పాఠశాలలోని ఓ విభాగం మొత్తానికి వారి పేరు పెట్టాలని సూచించారు.

కాగా, వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న సందర్బంగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు గ్రామాభివృద్ధి కమిటీలు చక్కటి తోడ్పాటును అందిస్తున్నాయని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులు మరింత పటిష్టం అవుతాయని అన్నారు.

వారం రోజుల్లోపు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై వారి భాగస్వామ్యం కోరుతామని, పనులను గ్రౌండిరగ్‌ చేసే సమయానికి అన్ని ఏర్పాట్లను చక్కబెట్టి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమం అమలు కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతులు ఏమిటి, ఇంకను అవసరమైన సదుపాయాలూ ఏమిటన్నవి గుర్తిస్తూ సమగ్ర వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్థానిక సర్పంచ్‌, స్కూల్‌ మేనేజిమెంట్‌ కమిటీ చైర్మన్‌, ఏ.ఈ ల వివరాలు, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఏ మాధ్యమంలో బోధనా జరుగుతోంది, పాఠశాల విస్తీర్ణం తదితర సమాచారంతో వెంటనే జాబితాను అందించాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సిఈఓ గోవింద్‌, డీఆర్‌డీఓ చందర్‌ నాయక్‌, విద్య శాఖ అధికారి నర్రా రామారావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »