అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే, మార్చి నెలాఖరు నాటికే బిల్లులు మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కాంట్రాక్టర్లకు సూచించారు.

డిచ్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. నడిపల్లిలో సి.సి రోడ్డు, అంగన్‌వాడీ కేంద్రం, బీబీపూర్‌ తండాలో బీటీ రోడ్డు, రాంపూర్‌లో వైకుంఠధామం, పశు వైద్యశాల భవన నిర్మాణం, రైతు వేదిక, వ్యవసాయ గిడ్డంగి, వృద్ధాశ్రమం, మిట్టపల్లిలో సి.సి రోడ్డు, పల్లె ప్రకృతి వనం తదితర వాటిని సందర్శించి పనుల ప్రగతిని పరిశీలించారు.

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం వండిన భోజనం తనిఖీ చేసిన కలెక్టర్‌ స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో బియ్యం నిల్వలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వల నాణ్యతను పరిశీలించారు. అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ సెంటర్‌కు సొంత భవనం సమకూర్చేందుకు చొరవ చూపాలని నిర్వాహకులు కోరగా, కలెక్టర్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

అంతకు ముందు కలెక్టర్‌ ధర్మారం (బి) పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు అవసరమైన వసతులు, సదుపాయాలను గుర్తిస్తూ నివేదిక అందిస్తే, మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ సూచించారు. ప్రహారీగోడ, తాగునీటి వసతి, టాయిలెట్స్‌, అదనపు తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ వంటి 12 రకాల పనులను ఈ కార్యక్రమం కింద చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి బిల్లులను సమర్పిస్తే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపే అవి మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కొత్తగా జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మరో 15 కోట్ల రూపాయాల విలువ చేసే పనులు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని కూడా వెంటనే చేపట్టే నెలాఖాకు నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. మిగతా కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులను వేగవంతంగా చేపడుతూ మే నెలాఖరులోగా అన్ని అభివృద్ధి పనుల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు.

మే నెల దాటితే వర్షాకాలం సీజన్‌ ప్రారంభం అవుతుందని, నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున ఆ లోపే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల, గ్రామా స్థాయిలలో జరిగే అభివృద్ధి పనులు వెంటదివెంట జరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అధికారులకు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ కోరారు. పనులను వేగవంతంగా జరిపిస్తూనే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.

సుమారు రూ. 200 కోట్ల పైచిలుకు విలువ చేసే అభివృద్ధి పనులు జిల్లాలో జరుగుతున్నాయని, వాటిలో ఇప్పటికే 70 శాతం పనులు వివిధ దశల్లో నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయన్నారు. మిగతా పనులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారాంతం లోపే ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా, మిట్టపల్లి వద్ద ప్రధాన రహదారికి ఆనుకుని నాటిన హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడం, పల్లె ప్రకృతివనం నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల నిర్వహణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణిని ఎందుకు వీడడం లేదని నిలదీశారు. తాను వారం రోజుల్లో మళ్ళీ వస్తానని, ఆ లోపు పరిస్థితిని చక్కబెట్టకపోతే బాధ్యులను సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట పంచాయతీరాజ్‌ డీ.ఈ శంకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »