డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి ఉత్సవం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మొదట సంత్ సేవాలాల్ చిత్రపటానికి పుష్పమాలతో అలంకరించి భోగ్ భండార్ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి సంత్ సేవాలాల్ ఘన కీర్తిని కొనియాడారు. సామాజిక సాంస్కృతికోద్యమ సంస్కర్తగా అభివర్ణించారు. బంజారా జాతిలో అపారమైన భక్తివిశ్వాసాలను పాదుగొల్పిన మహోన్నత వ్యక్తిగా కీర్తించారు. తన ప్రబోధనల ద్వారా బాంజారా జాతి జనులలో ధార్మికతను పెంపొందింపజేశారని అన్నారు. స్వచ్చమైన ప్రకృతితో సహజీవనం చేసే బంజారాలలో ముగ్ధత్వం, మూర్తిమత్వం పరిపూర్ణంగా వెల్లివిరుస్తుందన్నారు. సంత్ సేవాలాల్ ఒక వ్యక్తిగా అపారమైన సమిష్టి శక్తి సంపదలను ఆపాదించుకున్నారని అన్నారు. తరతరాల వరకు ఆయన ప్రబోధించిన మంచి, మానవత్వం, సంస్కరణ, ధర్మబోధన వంటివి ఆచరణీయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపాల్ డా. సిహెచ్. ఆరతి, దర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. భ్రమరాంబిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శాంతాబాయి తదితరులు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బోధనలు బంజారా జాతి సమూహానికంతటికి ఐక్యతను, సమిష్టి జీవనానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
డా. ప్రవీణ్ నాయక్, డా. రవీందర్ నాయక్, కిరణ్ రాథోడ్, బికోజీ నాయక్, సురేష్, మహవీర్, శ్రీధర్, లోకేశ్వర్, మోహన్ నాయక్, రమణ, సంతోష్ నాయక్ తదితర బంజారా అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులందరు భోగ్ భండార్ కార్యక్రమంలో సంత్ సేవాలాల్ కు ప్రార్థన చేస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందాలని, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలు అధిగమించాలని, వారికి మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకున్నారు.