డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2018-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కొత్తపల్లి నవీన్ యూజీసీ జేఆర్‌ఎఫ్ సాధించారు.
ఇది వరకే రెండు సార్లు యూజీసీ నెట్ సాధించిన నవీన్ శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) వెలువరించిన ఫలితాలలో మరోసారి నెట్‌తో పాటు జేఆర్‌ఎఫ్‌కు ఉత్తీర్ణులయ్యారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా శ్రమిస్తూ నేడు జేఆర్‌ఎఫ్ ను సాధించడం ఆనందాన్నిస్తుందన్నారు. తన శ్రమకు గుర్తింపు లభించిందన్నారు. ఎం.ఎ. తెలుగు అధ్యయనంలో మొదటి ర్యాంకును సాధించి, అప్పుడే మొదటి సారి నెట్ ఉత్తీర్ణత పొందిన సంగతిని గుర్తుచేసుకున్నారు. తాను ఈ విజయం పొందడం వెనుక తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకుల బృందం ప్రొత్సాహం ఎనలేనిదని అన్నారు. వారి సహాయ సహకారాలతో ‘‘అత్యాధునిక తెలుగు సాహిత్య ధోరణులు’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొత్తపల్లి నవీన్ జేఆర్‌ఎఫ్ సాధించడం పట్ల వీసీ, రిజిస్ట్రార్, తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు, పరిశోధకులు, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.