నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌ఐవి / ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ, హెచ్‌ఐవి / ఎయిడ్స్ వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కళాజాత బృందాలు పర్యటించి తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తాయని అన్నారు. ప్రధానంగా అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, సిరంజీలు వాడడం, కలుషిత రక్తాన్ని ఎక్కించడం వల్ల ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు.
హెచ్‌ఐవి సోకిన తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉందన్నారు. అయితే గర్భిణీ స్త్రీలు హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందితే పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవి సోకకుండా నివారించుకోవచ్చని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని, సురక్షిత లైంగిక పద్ధతులు పాటించాలని, అవసరమైన ప్రతీసారి డిస్పోజబుల్ సిరంజీ, సూదులు వాడాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్ నుండి మాత్రమే రక్తం తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ హితవు పలికారు.
హెచ్‌ఐవి సోకినట్టు అనుమానం కలిగిన వెంటనే అవసరమైన పరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడితే ఆరోగ్యకరమైన జీవితం గడుపవచ్చని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో 4019 మంది హెచ్‌ఐవి సోకిన వారుండగా, వారందరికీ ప్రభుత్వం తరపున ఆసరా పెన్షన్లు అందించడంతో పాటు వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు, పలు స్వఛరేద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.