పల్స్‌ పోలియో విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో మహమ్మారిని నిర్మూలించడం కోసం చేపట్టనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుండి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో పల్స్‌ పోలియో ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మొదటి రోజున పల్స్‌ పోలియో బూత్‌లలో అప్పుడే పుట్టిన శిశువు నుండి మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందు వేయడం జరుగుతుందని, మిగతా రెండు రోజుల పాటు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో నివారణ మందు వేయించని వారిని గుర్తిస్తూ చుక్కల మందు వేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ నూటికి నూరు శాతం లక్ష్య సాధన కోసం ఆయా శాఖలు అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. చిన్నారుల సంఖ్యకు సరిపడా పల్స్‌ పోలియో డోస్‌లు సిద్ధంగా ఉంచుకోవాలని, మూడు రోజుల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, సిబ్బందిని బూత్‌లకు తరలించేందుకు వీలుగా రవాణా సదుపాయాన్ని సమకూర్చాలని, ఈ కార్యక్రం గురించి ప్రజలకు తెలియజేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

వైద్యారోగ్య శాఖ, ఐసిడీఎస్‌, విద్యా శాఖా, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పల్స్‌ పోలియో కార్యక్రమంలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని, మిగతా శాఖలు కూడా దీని విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు చిన్నారులందరికి పల్స్‌ పోలియో చుక్కల మందు వేసేందుకు 1007 బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 37 ట్రాన్సిట్‌ బూత్‌లు, మరో 37 మొబైల్‌ బృందాలు పని చేస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం 4277 మంది సిబ్బంది, 101 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. గడిచిన ఏడు సంవత్సరాల నుండి మన భారతదేశంలో ఎలాంటి పోలియో కేసులు నమోదు కానప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్‌ పోలియోను నిర్వహిస్తోందని అన్నారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »