సింథటిక్‌ ట్రాక్‌ మంజూరుకు కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథ్లెటిక్స్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్‌ జిల్లాకు సింథటిక్‌ ట్రాక్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం స్థానిక జిల్లా క్రీడా అథారిటీ మైదానంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జట్లను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్‌ స్టేడియం ను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 213 .76 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ 99 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయిస్తోందని తెలిపారు.

వీటిలో ఇప్పటికే 31 స్టేడియంల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 33 ప్రాంగణాలు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని వివరించారు. మొత్తం 99 స్టేడియంలు అందుబాటులోకి వస్తే క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టేడియంలతో పాటు 19 .50 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తూ మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో అథ్లెటిక్స్‌ క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింథటిక్‌ ట్రాక్‌లను నిర్మింపజేస్తోందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. మెదక్‌లో ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణం పూర్తయ్యిందని, నిజామాబాద్‌ జిల్లాకు కూడా దీనిని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ప్రభుత్వం సమకూరుస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మనందరం కలిసి రేపటి సుస్థిర సమాజం కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావించాలన్నారు. గెలిచిన వారు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు.

ఓడిన వారు నిరుత్సాహపడకుండా గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత పట్టుదలతో కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎన్‌వైకె చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ తరహా క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ద్వారా యువత కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉన్న వారికి ఈ కార్యక్రమాల వల్ల ఎంతో ప్రయోజనమే చేకూరుతుందని పేర్కొన్నారు.

ఇలాంటి అవకాశాలను విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని క్రీడల్లో తమ ప్రతిభా పాటవాలను చాటుతూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌, ఎన్‌వైకె కోఆర్డినేటర్‌ శైలి బెల్లాల్‌, జిల్లా విద్య శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »