బాన్సువాడ, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య బోధన చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామీణ పేద విద్యార్థులకు విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. మన ఊరు- మన బడి అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమైందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని అనుకూలంగా మల్చుకొని ప్రజా ప్రతినిధులు అంకితభావంతో పాల్గొనాలని కోరారు. అవగాహన సదస్సులో జిల్లా విద్యాధికారి రాజు, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.