డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కో- ఆర్డినేటర్ డా. కె. రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్‌కు అవగాహనా సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ… విద్యార్థులందరిని భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కల్పిస్తుందని అన్నారు. అందుకు సమాజసేవలో విద్యార్థులందరిని ముందుంచడానికి ప్రోగ్రాం ఆఫీసర్స్ కృషి చేయాలని కోరారు. యూనిట్ ఆఫీసర్స్ పని పట్ల అంకిత భావాన్ని, నిబద్ధతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. తమ తమ యూనిట్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరులలో ఆత్మ విశ్వాసం, స్వయం కృషిని పెంపొందించాలని అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఎన్నుకొని అక్కడి ప్రజలకు ఆరోగ్యం మీద గాని, పరిశుభ్రత మీద గాని, అంటువ్యాధుల మీద గాని, స్వయం పాలన మీద గాని, చెట్ల అవసరం మీద గాని, మంచి నీటి ప్రాముఖ్యత మీద గాని, ఆడ పిల్లల చదువు ఆవశ్యకత మీద గాని అవగాహన కల్పించాలన్నారు. వివిధ సామాజిక, సాంసృతిక, సేవా కార్యకలాపాలను నిర్వహించాలన్నారు.
ర్యాలీలు, వీధి డ్రామాలు, పాటలు పాడి పల్లె జనులను చైతన్య పరచాలని సూచించారు. తద్వారా చెడు అలవాట్లు, సంఘ విద్రోహ చర్యలు నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని వినిర్మాణం చేయవచ్చని అన్నారు. ఈ విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ కళాశాల నుంచి వచ్చిన దాదాపు వంద మంది ప్రోగ్రాం ఆఫీసర్స్‌ను వీసీ ప్రత్యేకంగా పరిచయం చేసుకున్నారు. సమావేశం ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సురేశ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.