సోమవారం లోపు ప్రారంభం కాని ఉపాధి హామీ పనులు రద్దు చేస్తాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత సిసి రోడ్లు, సి.సి డ్రైనేజీల నిర్మాణం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సోమవారం లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తేల్చి చెప్పారు. లేనిపక్షంలో సంబంధిత పనులను రద్దు చేసి, అదే నియోజకవర్గంలోని ఇతర గ్రామ పంచాయతీలకు కేటాయిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తమకు పూర్తి వెసులుబాటు కల్పించిందన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధులు, ఎంపీ ల్యాడ్స్‌, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కింద జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీలలో కొనసాగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన పనులు, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు ఇంకనూ పెండిరగ్‌ లో ఉన్నాయన్న వివరాలను ఆరా తీస్తూ పనుల పూర్తి కోసం అధికారులకు స్పష్టమైన గడువులు విధించారు.

గడిచిన మూడు వారాల నుండి సివిల్‌ వర్క్స్‌ విషయంలో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తూ, స్వయంగా తాను నిర్విరామంగా సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, కొన్ని మండలాల అధికారుల తీరులో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పట్ల అలసత్వం వహించే మండల అభివృద్ధి అధికారులపై వేటు తప్పదని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రత్యేకించి ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులన్నీ ఈ నెల 28వ తేదీ సాయంత్రం లోపు ఆరునూరైనా ప్రారంభం కావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టమైన గడువు విధించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద మంజూరు చేసిన సి.సి డ్రైన్లు, సి.సి రోడ్ల పనులు ఇంకనూ పలు గ్రామ పంచాయతీలలో ప్రారంభించకపోవడం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేకూర్చే పనుల విషయంలో అలసత్వ ధోరణిని ఉపేక్షించబోమని, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అన్ని పనులు సోమవారం నాటికి తప్పనిసరిగా ప్రారంభం అయ్యేలా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ఉపాధి హామీతో పాటు మిగతా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తూ, ఈ ఆర్ధిక సంవత్సరం ముగియడానికి ముందే పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఏ ఒక్క పని కూడా గ్రౌండిరగ్‌ కాకుండా పెండిరగ్‌ ఉండకూడదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈజీఎస్‌ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయించాలని అధికారులకు హితవు పలికారు.

దీనివల్ల గ్రామాల్లో ప్రజోపయోగ ఆస్తులు కూడా అందుబాటులోకి వచ్చినట్లవుతుందని అన్నారు. అభివృద్ధి పనులకు ప్రజల నుండి కూడా పూర్తి సహకారం లభిస్తుందని, ఎటొచ్చీ అధికారులు పనుల పట్ల చొరవ చూపాలన్నారు. వచ్చే పక్షం రోజుల్లోపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే కనీసం ఐదు పనులు గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులను సంప్రదించిన మీదటే పనులను ఎంపిక చేయాలని సూచించారు.

కాగా, ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యం గణనీయంగా పెరిగేలా చూడాలని, పన్నుల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. హరితహారం కింద నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించేలా ఏర్పాట్లు చేస్తూ, అనునిత్యం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సిఈఓ గోవింద్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్‌డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆయా శాఖల ఇంజినీరింగ్‌ అధికారులు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »