కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీ బీ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో రూర్బన్ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా లోని జుక్కల్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాలను నిర్మూలించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
కేంద్రీయ విద్యాలయం కోసం అద్దె భవనాన్ని వారం రోజుల్లో చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఐదు వందల ఇరవై ఐదు వైకుంఠధామాలు పూర్తిచేసి వాడుకలోకి తీసుకువచ్చామని చెప్పారు. 526 కంపోస్టు షెడ్లు ఉపయోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.
విద్యుత్తు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి హామీ, పౌర సరఫరా, హౌసింగ్, ఐసిడిఎస్, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల పురోగతిని సమీక్ష చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.