డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో యాంటి ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ ఆచార్య సిహెచ్. ఆరతి ఆధ్వర్యంలో శుక్రవారం యాంటి ర్యాగింగ్ మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులందరు వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కుటుంబాల నేపథ్యం నుంచి ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చారని తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా, కులమత తారతమ్యం లేకుండా, జండర్ వివక్ష లేకుండా నడుచుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో దాదాపు అధిక శాతం గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చిన వాళ్లేనని గుర్తుచేశారు. కావున తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని కోరారు. తమ తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలు సాధించి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడిరప జేయాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) ఎ. వెంకటేశ్వర్ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల సైద్ధాంతిక నేపథ్యం, ఆత్మవిశ్వాసం, మేధోమదనం, మనస్తత్త్వ ధోరణి ఏ స్థాయిలో ఉంటుందో స్కెచ్ వేసి తెలిపారు.
ఈ సందర్భంగా తాను కాకతీయ కళాశాలలో చదువుకొనే రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణం, వివిధ విద్యార్థి సంఘాల మధ్య బేషజాలు, వ్యక్తిత్వ మానసిక విబేధాలు, సంఘ నిర్ణయాలకే కట్టుబడి ఉండి విభిన్న మార్గాలను అన్వేషించుకుంటూ వెళ్లిన విద్యార్థి నాయకులు, చివరకు ఒకానొక సందర్భంలో జీవితాలను కోల్పోయిన స్థితిగతులను క్రమంగా వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉపకులపతిగా నియామకం పొందిన తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న మంచి పరిణామాలను విశ్లేషించారు.
తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి, కష్టించి, శ్రమించి సంపాదిస్తూ మిమ్మల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారని విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. వారి స్పూర్తిని అందుకొని మంచి ఆశయంతో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. తమ జీవిత లక్ష్యాల మీద శ్రద్ధ పెట్టి నడుచుకోవాలని అన్నారు. విశ్వవిద్యాలయ చదువు అమూల్యమైనదని, ఇక్కడే మీ జీవన గమ్యం ఏర్పరుచుకోవానికి సరిjైున మార్గం దొరుకుతుందన్నారు. దాని కోసం అన్వేషణ ప్రారంభించాలని కోరారు.
ప్రపంచం కుగ్రామం అయిన ఈ తరుణంలో విస్త ృతమైన అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ జీవన ధ్యేయంపై కసి, ఆసక్తి పెంచుకోవాలన్నారు. మానవ విచక్షణ మిగతా జీవుల మధ్య బేధాన్ని చూపుతుందని, మానసిక స్వయం సమృద్ధి అలవరుస్తుందని అన్నారు. మనకు మనం తక్కువ అంచనా వేసుకోకూడదని అన్నారు. మీకు నచ్చిన మీ అమ్మానాన్నలను గాని, గురువును గాని, జాతీయ నాయకుడిని గాని, ప్రపంచ నాయకుడిని గాని ఆదర్శంగా తీసుకొని ఆ ఒరవడిని విజయం సాధించాలని అన్నారు.
ఒక ప్రొఫెసర్‌గా, ఒక పోలీస్‌గా, ఒక ఇంజనీర్‌గా , ఒక శాస్త్రవేత్తగా, ఒక మంచి నాయకుడిగా వెలుగొందే అవకాశం ఇక్కడి నుండే ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థుల్లో టీనేజ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆ వయస్సులో వారు అతిగా ఆలోచించడం, అతిగా నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి ప్రభావితమవుతారని అన్నారు. ముఖ్యంగా మన జిల్లాల్లో డ్రగ్స్ కు, డ్రిరక్ కు అలవాటు పడిన వారిలో యువకులే అధిక శాతం ఉంటున్నట్లు తెలిపారు. ‘‘డ్రగ్స్ ఫ్రీ’’ రాష్ట్రంగా మలచడానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు.
అలాగే ర్యాగింగ్ లాంటి పెను భూతం ఆవహించుకొని ఉన్న వాళ్లు ఉంటారని, అలాంటి వారిని ముందుగానే గుర్తించి మీ మీ ప్రొఫెసర్స్ కు సమాచారం అందించినట్లైతే వారికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వారి జీవితాలను రక్షించిన వారవుతారని అన్నారు. సదస్సులో డిచ్‌పల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయ తరగతి గదుల్లో, క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో, హాస్టల్ గదుల్లో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పరుచుకోవాలని సూచించారు. 1978 లో ప్రభుత్వం యాంటి ర్యాగింగ్ ఆక్ట్ రూపొందించిందన్నారు. ఈ ఆక్ట్ లో శిక్షలకు గురి అయితే వివిధ చట్టాల నేపథ్యంలో 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు జీవతం అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ‘‘ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్’’ గా మలిచే దిశగా కృషి చేస్తామని విద్యార్థుల తరుఫున హామి ఇచ్చారు. కార్యక్రమ ప్రారంభంలో విద్యార్థులు నవీన్, సాయిసుధ, శివకుమార్, చంద్రశేఖర్, అర్బాజ్ తదితరులు పాటలు పాడి సభను రంజింపజేశారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఎస్ కో- ఆర్డినేటర్ డా. కె. రవీందర్, డా. జి. రాంబాబు, డా. త్రివేణి, డా. ప్రభంజన్, డా. భ్రమరాంబిక, డా. గుల్ – ఇ – రాణా, డా. అబ్దుల్ ఖవి, జవేరియా తదితర కమిటీ సభ్యులు, డా. ఘంటా చంద్రశేఖర్, డా. పున్నయ్య, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.