నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమం విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్లో మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్, విద్యా శాఖ అధికారులతో కలెక్టర్ మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు – మన బడి అమలులో మండల స్పెషల్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. తొలి విడతగా జిల్లాలో విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఎంపిక చేసిన 407 పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఆయా బడులలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించాలన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యులు, స్కూల్ హెచ్ఎం, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పెంపొందించుకుని వాస్తవంగానే అవసరం ఉన్న పనుల గుర్తింపు జరిగేలా చూడాలన్నారు.
దీనివల్ల నిధులు వృధా కాకుండా నిలువరించగలుగుతామని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు కూడా పక్కాగా ఆయా పనుల అంచనాలు రూపొందించాలని అన్నారు. ప్రతి పాఠశాలలోను నిర్వహణ కమిటీలు బలోపేతంగా ఉంటూ, ఈ కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరిపించాలన్నారు. బిల్లుల చెల్లింపులు చెక్కుల ద్వారానే జరగాలని, ఇందుకోసం బ్యాంకులో ప్రత్యేకంగా ఎస్ఎంసి చైర్మన్, పాఠశాల హెచ్ఎం, స్థానిక సర్పంచ్, ఇంజినీరింగ్ విభాగం ఏ.ఈ ల పేరిట జాయింట్ అకౌంట్ తీయాలని తెలిపారు.
పూర్వ విద్యార్థుల ప్రాతినిధ్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ పేరిట మరో బ్యాంక్ అకౌంట్‌ను తెరుచుకోవాలని, విరాళాల ఆదాయ వ్యయాలను ఈ ఖాతా ద్వారా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పనుల్లో నాణ్యత లోపాలకు తావులేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. నిధుల వెచ్చింపు విషయమై సామాజిక తనిఖీ జరిపిస్తామని అన్నారు. అన్ని వర్గాల వారు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.