కామారెడ్డి, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్స్ పోలియోను శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం పల్స్ పోలియో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు రక్షణగా నిలుస్తాయని సూచించారు. ఒకరు తప్పిపోకుండా ఐదేళ్లలోపు పిల్లలందరికీ రెండు చుక్కల మందు వేయాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈనెల 27,28, మార్చి 1న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
జిల్లాలో 1,03,980 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారని చెప్పారు. వీరి కోసం 638 పల్స్ పోలియో కేంద్రాలను వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు పల్స్ పోలియో ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి చంద్రశేఖర్, పర్యవేక్షకుడు అజయ్ కుమార్, సంక్షేమ అధికారిణి సరస్వతి, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్, వైద్యాధికారులు డాక్టర్ శోభారాణి, శిరీష, రాజు, సుజాత్‌అలీ, ఆర్‌బిఎస్‌కే వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, అంగన్‌వాడి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.