నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సౌందర్య అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయ అధికారి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కురుమ సంఘంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సౌందర్య మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం వరకట్న నిషేధ చట్టాన్ని అవగాహనతో సద్వినియోగం చేసుకోవాలని భారత శిక్షణా స్థితిలో సెక్షన్ 498ఏ, ఐపిసి సెక్షన్ 3 మరియు 4 వరకట్న నిషేధ చట్టం 1983 తీసుకురావడం జరిగిందని వరకట్నం అనేది ఇవ్వడం తీసుకోవడం ప్రోత్సహించడం కూడా నేరంగానే అవుతాయని ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు మహిళలు చట్టాల పట్ల అవగాహనతో మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ కుటుంబంలో ఆడపిల్లల వివాహాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
దేశంలో గృహహింస మహిళలపై దాడులకు సంబంధించి 8 శాతం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడే నిందితులపై శిక్షలు పడతాయని మహిళలకు న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో కేసుల్లో తక్షణమే అరెస్ట్ చేయకుండా 41 ఏ సిఆర్‌పిసి నోటీసులు ఇవ్వడం ద్వారా పోలీసులు విచారణ చేపట్టి అభియోగపత్రం నమోదు చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు ఉంటుందని ప్రజలు ప్రతి ఒక్కరు చట్టాల పట్ల అవగాహనతో సమాజం నైతిక బాధ్యతగా నడుచుకోవాలని ఆమె పేర్కొన్నారు.
న్యాయవాది జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికారి సేవాసంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని దేశవ్యాప్తంగా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని న్యాయ అధికార సేవా సంస్థ ద్వారా రాజీపడదగిన అన్ని రకాల సివిల్ క్రిమినల్ మరియు మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, కక్షి దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసును పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ సిఐ నరేష్, 6వ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, అర్సపల్లి డివిజన్ కార్పొరేటర్ లావణ్య, నవీన్, పోలీసు అధికారులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.