కామారెడ్డి, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సత్య కన్వెన్షన్‌లో శనివారం కామారెడ్డి మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో తాను చర్చించి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. రూ.125.56 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి పట్టణ అభివృద్ధికి వచ్చాయని చెప్పారు. ఇందిరా గాంధీ చౌక్ నుంచి బైపాస్ వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ వరకు నాలుగు లైన్ల రోడ్లు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణంలో రెండు పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
49 వార్డులలో సిమెంటు రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కోసం రూ.11 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఆరు నెలల్లో పట్టణంలో వైకుంఠ దామాల నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. 720 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మూడు నెలల లోపు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. మున్సిపల్ నూతన చట్టం ప్రకారం బడ్జెట్ సమావేశాలకు తమకు హాజరయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 10 శాతం నిధులు గ్రీన్ బడ్జెట్ హరిత హారంలో మొక్కలు పెంచడానికి కేటాయించాలని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.