నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు రెవిన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో ధరణి కార్యక్రమంపై ఆర్దీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయా మండలాల వారీగా పెండిరగ్ ధరణి దరఖాస్తుల గురించి ప్రస్తావిస్తూ, వాటిని వెంటదివెంట పరిశీలిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మనం బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్నందున విధులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, అలా చేయనప్పుడు పదవిలో ఉండి ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు. దరఖాస్తులను నిబంధనలకు లోబడి ఉన్న వాటిని ఆమోదిస్తూ, నిబంధలు పరిధిలో లేని వాటికి స్పష్టమైన కారణాలు చూపుతూ తిరస్కరించడానికి ఇబ్బంది ఏముందని కలెక్టర్ ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్దేశ్యానికి అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి తావుండకూడదనే భావనతో ధరణి దరఖాస్తులను క్రమ పద్దతిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధరణి దరఖాస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ల్యాండ్ రికార్డ్స్ వివరాలను ఆన్ లైన్ అప్‌లోడ్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీనికై కొంత సమయం ఎక్కువ పట్టినా, భవిష్యత్తులో భూ సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు.
కాగా, మండలాలు, గ్రామాల వారీగా వాస్తవానికంటే పట్టా పాస్ బుక్కులలో ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతుల వివరాలను సర్వే నంబర్ల వారీగా క్రమ పద్దతిలో పొందుపరుస్తూ పది రోజుల్లోగా నివేదికలు సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అదేవిధంగా ఆయా మండలాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాల వివరాలను కూడా అందించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో కనీసం ఇరవై వరకు పాఠశాలలకు ఒక్కో బడికి కనీసం ఐదెకరాల చొప్పున స్థలాన్ని కేటాయించాల్సి ఉందన్నారు. దీంతో పాటు స్వతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు కేటాయించాల్సిన భూముల ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నందున ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ సుదర్శన్, ఆయా మండలాలు తహసీల్దార్లు, కలెక్టరేట్ లోని రెవిన్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు.