నిజామాబాద్, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు ఆరోగ్యవంతమైన చక్కటి భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలెక్టర్ ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్స్ పోలియోను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1007 కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ చుక్కల మందు వేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో లక్షా 85 వేల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి, ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా తొలి రోజునే పిల్లలందరికీ పోలియో నివారణ మందు వేయాలని వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 37 మొబైల్ బృందాలను కూడా ఏర్పాటు చేయించామని కలెక్టర్ వివరించారు.
ప్రయాణాల్లో ఉన్న వారి పిల్లలకు చుక్కల మందు వేసేందుకు వారి వెసులుబాటు కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా పల్స్ పోలియో బూత్‌లు అందుబాటులో ఉంచామన్నారు. నూటికి నూరు శాతం లక్ష్యాన్ని నమోదు చేయడానికి ప్రతి నివాస ప్రాంతం పరిధిలోనూ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజైన ఆదివారం ఏవైనా కారణాల వల్ల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించలేకపోయిన వారు, సోమ, మంగళవారం రెండు రోజుల పాటు తమతమ ఇళ్ల వద్దకు వచ్చే అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలకు సహకరిస్తూ, అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు.
జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలతో ఉన్న చిన్నారులకు కూడా పోలియో నివారణ మందు వేయించాలని సూచించారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో పకడ్బందీగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగిస్తోందని అన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విధిగా చుక్కల మందు వేయించాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు మండల, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా పల్స్ పోలియో విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
చుక్కల మందు పట్ల ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా తమ చిన్నారుల అందమైన రేపటి భవిష్యత్తు కోసం రెండు చుక్కలు పోలియో నివారణ మందు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు రాములు, డీఎం హెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎం హెచ్‌ఓ డాక్టర్ తుకారాం, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలావుండగా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దంపతులు స్వయంగా ఖలీల్ వాడి మోడరన్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి తమ చిన్నారులకు చుక్కల మందు వేయించారు.