నిజామాబాద్, మార్చ్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రష్యా దేశం దిష్టిబొమ్మను ధర్నాచౌక్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు.
ఈ యుద్ధానికి ప్రత్యక్షంగా రష్యా కారణమైతే, పరోక్షంగా అమెరికా, నాటో దేశాల కుట్రలు ఉన్నాయన్నారు. తమ ఆయుధ వ్యాపారం, అగ్రరాజ్య హోదాకోసం అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ను తమ పావుగా వాడుకుంటున్నాయన్నారు. ఈ పరిణామాలు తమ దేశానికి ముప్పని భావించి, రష్యా యుద్ధం ప్రకటించి మారణహోమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ మారణహోమానికి అమెరికా, నాటో, రష్యా దేశాల విస్తరణ కాంక్ష కారణమన్నారు. వెంటనే రష్యా యుద్ధాన్ని ఆపివేయాలని, భారత్ సహా అన్ని దేశాలు ప్రపంచశాంతి కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉక్రెయిన్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భారత విద్యార్థులను తరలించడంలో మోడీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శించిందన్నారు. కొద్దిమంది విద్యార్థులను తరలించి, విద్యార్థులందరినీ ఇండియాకు తీసుకువచ్చామని అన్నట్లుగా మోడిసర్కారు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల కర్ణాటక విద్యార్థి బాంబు దాడిలో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత విద్యార్థులు తాగునీరు, ఆహారం, కనీసం మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కొన్నిచోట్ల సైనికులు భారత విద్యార్థులను చితకబాదుతున్నారన్న వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులందరినీ స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వం, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ జిల్లా నాయకులు వెంకన్న, గంగన్న, ముత్తెన్న, మల్లేశ్, రాజేశ్వర్ వివిధ ప్రజాసంఘాల నాయకులు కిషన్, సుధాకర్, సాయాగౌడ్, సంధ్యారాణి, కల్పన, కిషన్, మురళి, సాయరెడ్డి, కిరణ్, విఠల్, అశుర్, రమేష్, వేణు, రవి, చరణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.