అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు.

పనులు నాణ్యతతో చేపడుతూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పది కాలాల పాటు మన్నిక ఉండేలా నిర్మాణాలు జరిపిస్తేనే ప్రజాధనం పూర్తి స్థాయిలో సద్వినియోగం జరిగినట్లు అవుతుందని హితవు పలికారు. కాగా పలు చోట్ల అభివృద్ధి పనులకు కొంత మంది అడ్డుపడుతున్నారని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తేగా, అలాంటి వారిపై పోలీసు కేసులు పెట్టించాలన్నారు.

ప్రభుత్వపరంగా జరిగే అభివ ృద్ధి పనులను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని, ఎవరైనా పనుల నిర్మాణాలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లాలని అధికారులకు తేల్చి చెప్పారు. సుభాష్‌ నగర్‌లో సిసి రోడ్డు నిర్మాణం పనులు జరిపిస్తున్న క్రమంలో స్థానికుడు ఒకరు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలుపగా, సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, సీడీపీ, ఎంపీ ల్యాడ్స్‌ తదితర వాటి కింద జిల్లాకు మంజూరైన సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. వీటిలో ఇప్పటికే డెబ్బై శాతం పనులు వివిధ దశల్లో కొనసాగుతూ, త్వరలోనే పూర్తి కానున్నాయని వివరించారు. మంజూరైన అన్ని పనులను గ్రౌండిరగ్‌ చేయిస్తూ, సకాలంలో వాటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో గడిచిన నెల రోజుల నుండి స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నామని అన్నారు.

ఈజీఎస్‌ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి, ఈ నెలాఖరునాటికి బిల్లులు సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. మిగతా పనులను కూడా వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడానికి ముందే మే నెలాఖరు లోపు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు చేదోడువాదోడుగా నిలుస్తూ, తమతమ ప్రాంతాలకు మంజూరైన పనులు నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, దర్యాపుర్‌ చెరువు శిఖం భూమి కబ్జాకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర పరిశీలన జరిపారు. రెవిన్యూ, సర్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి నివేదికను తనకు అందించాలని ఆదేశించారు. శిఖం పరిధిలోని ఒక్క గుంట భూమిని కూడా కబ్జా బారిన పడకుండా చూస్తామని, ఒకవేళ శిఖం స్ధలాన్ని కబ్జా చేసినట్లు తేలితే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట నవీపేట ఎంపీడీవో సాజిద్‌ అలీ, తహసీల్దార్‌ లతా, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »