నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్, నార్త్, రూరల్ తహాసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నాయకులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, వృద్ధాప్య పెన్షన్ వయస్సు 65 సంవత్సరాల నుండి 57 ఏళ్లవరకు తగ్గిస్తూ జీవో విడుదల చేసిందని, అయినా ఇంతవరకు పెన్షన్ల అమలులో ముందడుగు పడలేదన్నారు.
ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి, వితంతు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదల్లో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించి వేగవంతం చేయాలన్నారు. తొలగించిన ఆసరా పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధన కోసం త్వరలోనే సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల ముందు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నాయకులు సాయాగౌడ్, మురళి, పీ.డీ.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కల్పన, నాయకులు అశుర్, మహిపాల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.