కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కామారెడ్డి పట్టణంలోని తాహెర్ గార్డెన్‌లో మంగళవారం ఐసిడిఎస్, ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగం, ఉపాధి, సామాజిక సేవ వంటి రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చూపవచ్చని పేర్కొన్నారు. ఉత్తమంగా సేవలందించిన మహిళా ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. అంకితభావంతో పనిచేసిన మహిళా ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మహిళా ఉద్యోగులు కృషి చేస్తున్నారని చెప్పారు. లింగ వివక్ష లేకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన ఫీల్డ్ పబ్లిక్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడి కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన మహిళా ప్రజాప్రతినిధులకు, జిల్లా స్థాయి ఉద్యోగులకు సన్మానం చేశారు. సమావేశంలో టి ఎస్ పి ఎస్ సభ్యురాలు సుమిత్రానందన్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని సూచించారు. వారికి సరైన గౌరవం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా వినియోగదారుల పోరం అధ్యక్షురాలు బొమ్మెర సువర్ణ చంద్రశేఖర్, జిల్లా అధికారిణులు వాణి, నిఖిత, భాగ్యలక్ష్మి, శోభారాణి, స్వర్ణలత, స్రవంతి, జానకి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ సత్యనారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.