ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో అద్భుతాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కోసం ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి బోర్గం(పి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యా శాఖ అధికారులతో కలిసి వీ. సిలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన ఆవశ్యకత, ప్రభుత్వ ఉద్దేశ్యాలు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల విధివిధానాలు, వారు నిర్వర్తించాల్సిన విధులు, ఆంగ్ల బోధన ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా విద్యా శాఖ అధికారులకు సూచనలు చేశారు.

రాష్ట్రంలో 81,590 ఉపాధ్యాయులకు 4 వారాల పాటు శిక్షణ అందించడం జరుగుతుందని, దీని కోసం రాష్ట్ర స్థాయిలో 363 రిసోర్స్‌ పర్సన్స్‌, జిల్లా స్థాయిలో 2,583 రిసోర్స్‌ పర్సన్స్‌ను గుర్తించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసిన అనంతరం కలెక్టర్‌ నారాయణ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వీ.సీ హాల్‌లోనే సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టి 7 వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో సత్తా చాటాలనే సత్సంకల్పంతో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటవ తరగతి మొదలుకుని 8వ తరగతి వరకు అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనను ప్రవేశపెడుతోందని అన్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమం బోధన కోసం ప్రఖ్యాత అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌లచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిందన్నారు.

ఉపాద్యాయులు శిక్షణ తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుడే విద్యార్థులకు ఆంగ్లంలో నాణ్యమైన బోధనను అందించగల్గుతారని అన్నారు. బడులలో ఎంత మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, బోధనా విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు సరిగా లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు ఆంగ్ల బోధనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని హితవు పలికారు.

తెలుగు మాధ్యమంలో చదివిన ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఆంగ్ల బోధన కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చని, కానీ ఆంగ్లంలో బోధనను నేర్చుకోవడం కష్టమేమి కాదని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఒకవిధంగా చూస్తే 56 అక్షరాలతో కూడిన తెలుగు భాషలో బోధనను నేర్చుకోవడమే కాస్తంత కష్టంగా ఉంటుందని, అర్ధం చేసుకుంటే ఆంగ్లం ఎంతో సులువేనని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యేందుకు కష్టతరమైన డీఎస్‌సి రాసి ఉత్తమ ప్రతిభను చాటుకున్న వారికి ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమ బోధనను అలవర్చుకోవడం సులభమేనని అన్నారు. ఉపాధ్యాయులు తాము ఆంగ్లంలో మాట్లాడడమే కాకుండా విద్యార్థులు కూడా ఆంగ్లంలో మాట్లాడేలా చూడాలని, అప్పుడే తొందరగా ఆంగ్ల భాషను ఆకళింపు చేసుకోగల్గుతారని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, నర్రా రామారావు, ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »